
ఎన్టీఆర్ జిల్లా:30-11-25:-పెనుగంచిప్రోలు గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద నిర్మించిన విశాలమైన డార్మెట్రీకు ఇప్పటికీ నేమ్‌బోర్డు లేకపోవడం భక్తుల్లో ఆగ్రహం రేపుతోంది. దూర ప్రాంతాల నుంచి పిల్లలతో సహా పెద్దఎత్తున వచ్చే భక్తులు రాత్రివేళ విశ్రాంతి కోసం ఇబ్బందులు పడుతుండగా, భక్తుడొకరు సుమారు రూ.1.50 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ ఉచిత విశ్రాంతి భవనం గత తొమ్మిది నెలలుగా వినియోగంలోనే ఉంది.
సుమారు వెయ్యిమందికి పైగా భక్తులు రాత్రింబగళ్లు సేదతీరే వీలున్న ఈ విశాల డార్మెట్రీ వద్ద ‘ఉచిత విశ్రాంతి భవనం’ అని గుర్తింపుగా ఎలాంటి బోర్డు లేకపోవడంతో కొంతమంది భక్తులు తెలియక ఆలయం వద్ద ఉన్న ప్రైవేట్ గదులను మాత్రమే ఆశ్రయిస్తూ అనవసరంగా డబ్బులు ఖర్చుచేస్తున్నట్టు సమాచారం. భద్రతాపరమైన ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి“ఇంతటి దాతృత్వంతో నిర్మించిన భవనానికి నేమ్‌బోర్డు లేకపోవడం ఆశ్చర్యకరం. రాత్రివేళ కూడా సులభంగా కనిపించేలా లైటింగ్‌తో కూడిన బోర్డు ఏర్పాటు చేయాలి” అని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.







