
అమరావతి: నవంబర్ 28:-రాష్ట్ర అభివృద్ధి యజ్ఞంలో భాగంగా అమరావతి నిర్మాణం వేగంగా ముందుకు సాగుతుండటం ఆనందదాయకమని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రాజధానిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి అన్ని విధాల సహకారం అందించడానికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.పూర్వోదయ పథకంలో రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలు అభినందనీయమని మంత్రి ప్రశంసించారు. ఉద్యాన పంటల ఉత్పత్తులను జాతీయ మార్కెట్లకు తరలించే అవకాశాలపై దృష్టి పెట్టాలని బ్యాంకులకు సూచిస్తూ… కేవలం కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలకు పరిమితం కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, కోల్డ్ చెయిన్ వంటి రంగాలకు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల రైతులకు ఇతర రాష్ట్రాల మాదిరిగా రవాణా సదుపాయాలు అందేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుకు రావాలని అన్నారు.
అమరావతి నిర్మాణం ఓ భారీ యజ్ఞమని వ్యాఖ్యానించిన సీతారామన్… రాజధాని ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ అంశాలు తీసుకెళ్లిన వెంటనే ఆమోదిస్తున్నారని, విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్రానికి పూర్తి స్థాయి సహాయమే కేంద్ర లక్ష్యమని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఏఐ ప్రాజెక్టులు, క్వాంటం వ్యాలీ స్థాపన, జిల్లాల్లో ఏఐ శిక్షణా కేంద్రాల ఏర్పాటు వంటి ప్రతిపాదనలు వేగంగా అమలు దిశగా సాగుతున్నాయని తెలిపారు. అమరావతిలో అత్యాధునిక ప్లానెటోరియం నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు.సైన్స్ రంగంలో ఆంధ్రుల ప్రతిభ ఎన్నో సార్లు నిరూపితమైందని, బెనారస్ హిందూ యూనివర్శిటీలో సైన్స్ విభాగంలో ఆంధ్రులే అగ్రస్థానం దక్కించుకున్నారని గుర్తుచేశారు. ఆచార్య నాగార్జునుడి సూత్రాలు టిబెట్ వరకూ వ్యాప్తి చెందాయని వివరించారు. రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలో కేంద్రం కీలకమైన నిర్ణయాలు తీసుకుందని… ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాలని కోరారు.రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా రాయలసీమ పురోభివృద్ధి కోసం పూర్వోదయ పథకం కింద రూ.39 వేల కోట్లతో ఏపీ రూపొందించిన ప్రణాళికలు కేంద్ర సహకారంతో ముందుకు సాగనున్నాయి.







