
- మద్రసా-ఎ-మష్కూరియాలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
- హాజరైన ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, వివిధ ప్రాంతాల భక్తులు
- రంజాన్ విశిష్టతను వివరించిన పీఠాధిపతులు
అనంతసాగరం: మండల కేంద్రమైన అనంతసాగరంలోని మద్రసా-ఎ-మష్కూరియాలో ‘ఫైజానే రంజాన్’ ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ జరిగింది. సూఫీ మత గురువులు హజరత్ సయ్యద్ షా సాని సాహెబ్ ఖిబ్లా, హజరత్ సయ్యద్ షా మజీద్ అలీషా ఖాదరీ సాహెబ్ పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తరలివచ్చిన వేలాది మంది భక్తులకు, అతిథులకు నిర్వాహకులు భారీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) ప్రభాకర్ రెడ్డి దర్గాను సందర్శించి, నిర్వాహకులను ప్రత్యేకంగా కొనియాడారు. అనంతరం మద్రసాలో విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు బహుమతులు ప్రదానం చేసి వారిని ఉత్సాహపరిచారు.
భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు.. మండల ప్రభుత్వ ఖాజీ సయ్యద్ తన్వీర్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొని మష్కూరి బాబా సన్నిధిలో సలాం సమర్పించారు. అనంతరం పవిత్ర ఖురాన్ తిలావత్ (పారాయణం) చేశారు. వేలాది మంది మురీదులు, మష్కూరి బాబా శిష్యులు ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు సాని సాహెబ్, మజీద్ సాహెబ్ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలోనే ఖురాన్ అవతరించిందని, ఈ నెలలో చేసే ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని భక్తులకు వివరించారు.
ఈ విశేష ఇఫ్తార్ విందు మరియు ప్రార్థనల్లో స్థానికులతో పాటు విజయవాడ, గుడివాడ, చీరాల, పర్చూరు, వేటపాలెం, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దర్గాను దర్శించుకుని మష్కూరి బాబా ఆశీస్సులు పొందారు.http://POTTI SRIRAMULU NELLORE DISTRICT NEWS







