AP ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు గడువు పొడుగు.. DEECET కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల||AP Inter 1st Year Admissions Extended | DEECET 2025 Counselling Schedule Released
AP ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు గడువు పొడుగు.. DEECET కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును జూలై 31 వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా ప్రకటనలో, “విద్యార్థులు, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు, కొన్ని కళాశాలల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగిస్తున్నాం” అని తెలిపారు. పదో తరగతి సప్లిమెంటరీతో కలిపి మొత్తం 5,92,602 మంది ఉత్తీర్ణత సాధించగా, ఇప్పటి వరకు 4.90 లక్షల మంది మాత్రమే ఇంటర్‌లో చేరారు. మరికొంత మంది ఐటీఐ, పాలిటెక్నిక్, ఇతర కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకున్నారు.
అర్హులైన విద్యార్థులు త్వరితగతిన సమీప జూనియర్ కాలేజీలలో అడ్మిషన్లు పొందాలని ఇంటర్ బోర్డు సూచిస్తోంది. జులై 31 తుదిగడువు కావడంతో మరింత ఆలస్యం చేయకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇంటర్ బోర్డు అకడమిక్ క్యాలెండర్ విడుదల:
ఇప్పటికే ఇంటర్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 314 పని దినాలు, 79 రోజులు సెలవులు ఉండనున్నాయి. జూన్ 2 నుంచే జూనియర్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు జరుగుతుండగా, సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు కొనసాగుతున్నాయి.
DEECET 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల:
ఇక, 2025-26 విద్యా సంవత్సరానికి డీఈఈసెట్ (DEECET) ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను కూడా అధికారులు విడుదల చేశారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం:
✅ జూలై 6 నుండి డీఈఈసెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి.
✅ జూలై 6, 7 తేదీల్లో సీట్ మ్యాట్రిక్స్ సిద్ధం చేస్తారు.
✅ జూలై 8 నుండి 12 వరకు వెబ్ ఐచ్ఛికాలకు అవకాశం కల్పిస్తారు.
✅ జూలై 13 నుండి 16 వరకు సీట్ల కేటాయింపు, ప్రొవిజనల్ లెటర్ల జారీ జరుగుతుంది.
✅ జూలై 17 నుండి 22 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
✅ జూలై 25 నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి.
డీఈఈసెట్ ద్వారా డి.ఎడ్ కోర్సులో ప్రవేశం పొందాలని ఆశించే విద్యార్థులు జూలై 6 నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.