జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అజెండా అంశాలకు సంబంధించి మాట్లాడుతూ జిల్లాలో 06-02-2025 తో ఇసుక త్రవ్వకాలకు అనుమతులు ముగిసిన గుండె మెడ, మున్నంగి , బొమ్మువానిపాలెం 14, 15 ఇసుక రీచ్ లలో నిల్వ ఉన్న 39,529 మెట్రిక్ టన్నుల ఇసుకను నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం ప్రజలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుండెమెడ 2 ఓపెన్ ఇసుక రీచ్ , బొమ్మువానిపాలెంలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు వచ్చిన వెంటనే గతంలో నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం బిడ్డింగ్ ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేయాలన్నారు. గ్రామం పరిధిలో నోటిఫై చేసిన ఇసుక రీచ్ లో నుండి వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ఎద్దుల బండ్లు పై ఇసుకను తీసుకువెళ్లేందుకు అనుమతి ఉందని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, జిల్లా మైన్స్ జియాలజీ అధికారి వెంకటసాయి, జిల్లా ఉప రవాణా కమిషనర్ కె సీతారామిరెడ్డి , జిల్లా భూగర్భజలవనరుల శాఖ డీడీ వందనం, తహశీల్దార్లు సిద్ధార్ద, డి సీతారామయ్య, ఆర్ డబ్ల్యు ఎస్ ఎస్ఈ కళ్యాణ చక్రవర్తి, రిజర్వ్ కన్జర్వేటీవ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
234 1 minute read