
విశాఖపట్నం:14-10-25 ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో రూ.87,250 కోట్లతో ఏర్పాటు కాబోతున్న డేటా సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని రాష్ట్ర చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఇది కూటమి ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
గూగుల్‌తో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, సిఫీ, సత్వా, డబ్ల్యూఎన్‌ఎస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖను కేంద్రంగా ఎంపిక చేసుకోవడాన్ని రాష్ట్రానికి లభిస్తున్న గౌరవంగా అభివర్ణించారు. ఈ ఐటీ సంస్థల ఏర్పాటుతో సాగరనగరం రూపురేఖలు మారనున్నాయని, సమగ్ర ఆర్థిక ప్రగతికి ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు.చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం దేశ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ ఎఫ్‌డీఐ ఒప్పందాన్ని సాధించిందని అన్నారు. ఇది వారి దృఢ సంకల్పం, సమర్థతకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.2029 నాటికి ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాల లక్ష్యంతో రాష్ట్రం దూసుకెళ్తోందని, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు ఆ దిశగా కీలక మైలురాళ్లుగా నిలుస్తాయని జీవీ పేర్కొన్నారు. విశాఖపట్నం దేశంలోని మొట్టమొదటి ఏఐ నగరంగా అభివృద్ధి చెందనుందని తెలిపారు.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, విశాఖపట్నం, వీఎంఆర్డీఏ పరిధిలో అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులు రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులను ఆకర్షిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, రాయలసీమలో రక్షణ, ఏరోస్పేస్, సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి సమతుల్యంగా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టుల ద్వారా చదువుకున్న యువతకు సొంత ప్రాంతాల్లోనే ప్రపంచ స్థాయి ఉద్యోగాలు లభించనున్నాయని, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు లేదా దేశాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తుందని అన్నారు.







