
గుంటూరు: డిసెంబర్ 31:-ప్రజలకు అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారం నిర్దేశిత పరిమాణంలో అందించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు.
బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మిర్చి యార్డ్‌లోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ పరిసరాల శుభ్రతతో పాటు ఉదయం సరఫరా చేస్తున్న అల్పాహారాన్ని పరిశీలించారు. రోజువారీగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం తీసుకుంటున్న వారి సంఖ్య, నిర్వహణ విధానం, శుభ్రత పనులపై క్యాంటీన్ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు.

అల్పాహారం తీసుకుంటున్న కార్మికులు, మిర్చి విక్రయానికి వచ్చిన రైతులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహన డ్రైవర్లతో కలెక్టర్ మాట్లాడి ఆహార నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకోగా, వారు సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా అల్పాహారాన్ని భుజించి ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నందున భోజనశాల, ఆహార సరఫరా ప్రాంతాలు, క్యాంటీన్ ఆవరణను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణతో పాటు మౌలిక వసతులపై నగరపాలక సంస్థ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ
అనంతరం మిర్చి యార్డ్ సమీపంలోని సుబ్బారెడ్డి నగర్లో జనవరి నెల ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లను జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పలువురు వృద్ధులు, వితంతువులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెన్షన్ దారుల జీవన విధానం, రేషన్ సరఫరా, ఆరోగ్య పరిస్థితులు, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

ఇంటి స్థలాలు, గృహ నిర్మాణ రుణాల మంజూరుకు సంబంధించిన సమస్యలను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని తక్షణమే పరిశీలించి పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారుసైన్స్ ఫెయిర్ల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రంపై ఆసక్తిపెరుగుతుంది -కలెక్టర్.
తదుపరి కెవిపి కాలనీలో నిర్మాణంలో ఉన్న సిమెంటు రోడ్డును పరిశీలించిన కలెక్టర్, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పనులు పూర్తిచేయాలని సూచించారు. రోడ్డు నిర్మాణ ప్రదేశంలో సైడ్ డ్రెయిన్లపై ఉన్న పైపులైన్లను పక్కకు మార్చాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య, నగరపాలక సంస్థ ఎస్ఈ సుందర రామిరెడ్డి, ఎంహెచ్ఓ డా. లక్ష్మీనారాయణ, ఉపాసెల్ పీఓ సింహాచలం, సచివాలయ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.










