
బాపట్ల: పర్చూరు:10.01.2026:-పర్చూరు నియోజకవర్గం, పర్చూరు మండలం పరిధిలోని అన్నంబొట్లమవారి పాలెం గ్రామంలో శనివారం రిసర్వే పూర్తి అనంతరం రాజముద్రతో ముద్రించిన భూహక్కు పత్రం పట్టదారు పాస్ బుక్స్ (మీ భూమి – మీ హక్కు) పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఐ.ఏ.ఎస్. ముఖ్య అతిథిగా హాజరై రైతులకు స్వయంగా పట్టదారు పాస్ బుక్స్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రిసర్వే ద్వారా భూముల హద్దులు స్పష్టంగా నమోదు కావడంతో రైతులకు భూ వివాదాలు తగ్గి భద్రత కలిగిన హక్కులు లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టదారు పాస్ బుక్స్ రైతుల ఆస్తి హక్కులకు చట్టబద్ధమైన ఆధారమని పేర్కొన్నారు. భవిష్యత్తులో రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.Bapatla Local News
కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, పర్చూరు తహశీల్దార్ బ్రహ్మయ్య, గ్రామ సర్పంచ్ ఎన్. ఆనంతమ్మ పాల్గొని రైతులను అభినందించారు. అధికారులు రిసర్వే ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు హాజరై పట్టదారు పాస్ బుక్స్ స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలతో తమ భూములకు భద్రత పెరిగిందని రైతులు పేర్కొన్నారు.










