
గుడివాడ, నవంబర్ 5:-గుడివాడలోని ప్రసిద్ధ విద్యాసంస్థ ఏఎన్ఆర్ కళాశాల ఈ సంవత్సరం తన వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 16, 17, 18 తేదీలలో ఈ వేడుకలు జరగనున్నాయని కళాశాల కమిటీ సెక్రటరీ & కరస్పాండెంట్ కె.ఎస్. అప్పారావు, కమిటీ చైర్మన్ కొల్లి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్, కార్యదర్శి డా. సూరపనేని శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ డా. పి.జె.ఎస్. కుమార్ తెలిపారు.వారు మాట్లాడుతూ—1950లో ఆవిర్భవించిన ఏఎన్ఆర్ కళాశాల 75 ఏళ్ల ప్రస్థానంలో అనేక సవాళ్లను ఎదుర్కొని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కళాశాల పూర్వ విద్యార్థులు ఉన్నత పదవుల్లో కొనసాగుతూ కళాశాల పేరు మరింత వెలుగొందిస్తున్నారని తెలిపారు.

వజ్రోత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పట్లో రైతులు పెద్దమనసుతో 15 ఎకరాలు విరాళంగా ఇవ్వడం, ఏఎన్ఆర్ కుటుంబం నగదు సహాయం అందించడంతో కళాశాల స్థాపించబడిన విషయాన్ని గుర్తుచేశారు
.డిసెంబర్ 16న రైతుల కోసం రైతు సదస్సు, 17న పూర్వ విద్యార్థుల సత్కారం, 18న ప్రధాన వజ్రోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆ రోజున మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, సినీ హీరో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు.







