ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2026 పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలు, గడువులను ప్రకటించింది. విద్యార్థులు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 10, 2025 వరకు తమ పరీక్షా ఫీజులు చెల్లించవచ్చు. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 21 వరకు ఆలస్యంగా ఫీజు చెల్లించిన పక్షంలో రూ.1,000 జరిమానా విధించబడుతుంది. ఈ గడువు తర్వాత ఎలాంటి అవకాశం ఇవ్వబోమని బోర్డు స్పష్టం చేసింది.
ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం థియరీ పరీక్ష ఫీజు రూ.600గా నిర్ణయించారు. ప్రాక్టికల్స్ ఫీజు రూ.275గా ఉంది. బ్రిడ్జ్ కోర్సు సబ్జెక్టులకు రూ.165, బ్రిడ్జ్ కోర్సు ప్రాక్టికల్స్‌కు రూ.275 వసూలు చేయనున్నారు. మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం కలిపి ఫీజులు చెల్లించాలనుకుంటే థియరీ రూ.1,200, ప్రాక్టికల్స్ రూ.550 చెల్లించాలి. పాత సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు మళ్లీ హాజరవ్వాలనుకుంటే ఆర్ట్స్ విభాగానికి రూ.1,350, సైన్స్ విభాగానికి రూ.1,600గా ఫీజులు నిర్ణయించారు.
2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌లో కూడా మార్పులు జరిగాయి. సాధారణంగా మార్చిలో జరిగే ఈ పరీక్షలను ముందుకు జరిపి ఫిబ్రవరి 2026లో నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. దీని ద్వారా సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్‌తో సమన్వయం కలుగుతుంది. అలాగే ఏప్రిల్ నుంచే కొత్త తరగతులు ప్రారంభమవుతాయి. దీంతో విద్యార్థులకు మరిన్ని బోధనా రోజులు లభిస్తాయి.
ఈసారి పరీక్షల్లో ఒక పెద్ద మార్పు చేసింది. ఇప్పటివరకు భాషా పేపర్లతో ప్రారంభమయ్యే పరీక్షలు, ఈసారి సైన్స్ సబ్జెక్టులతో మొదలవుతాయి. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్టులు ముందుగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి సబ్జెక్టుకు ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎంబీపీసీ (Mathematics, Biology, Physics, Chemistry) గ్రూప్ విద్యార్థుల సౌకర్యం కోసం ఈ విధంగా మార్పులు చేపట్టారు.
బోర్డు అధికారులు విద్యార్థులు గడువులు మించకుండా వెంటనే ఫీజులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆలస్యంగా చెల్లించే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.