
ఉదయ్‌పూర్15-10-25:-రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక మంత్రుల ద్వితీయ దిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు మంజూరు చేయాలంటూ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు.

ఈ సమావేశంలో ఏపీ తరఫున పలు ప్రతిపాదనలు సమర్పించిన మంత్రి దుర్గేష్, తిరుపతిలో కల్నరీ ఇన్‌స్టిట్యూట్, అమరావతిలో పర్యాటక భవన్, రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తరువాత పర్యాటక భవన్ తెలంగాణలోనే మిగిలిపోయిన నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్‌కు నూతనంగా మంజూరు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
“అమరావతిలో నిర్మించబోయే ఆధునిక పర్యాటక భవన్ ద్వారా పర్యాటకులకు అవసరమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. కేంద్రం త్వరితగతిన ఆమోదం తెలపాలని కోరుతున్నాం,” అని మంత్రి దుర్గేష్ అన్నారు.ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా, తిరుపతి, విశాఖపట్నంలను ప్రపంచ పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం హామీ ఇచ్చిందని వివరించారు.ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పర్యాటక విధానం భేష్ అని కొనియాడిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్, మంత్రి దుర్గేష్ సమర్పించిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేశారు.సదస్సు అనంతరం, మంత్రి కందుల దుర్గేష్ — రాష్ట్ర టూరిజం ఎండీ ఆమ్రపాలి కాటతో కలిసి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ప్రత్యేకంగా కలసి, రాష్ట్రానికి మరింత సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి ఇప్పటికే కేంద్రం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఇరువురు మంత్రుల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి షెకావత్ అన్ని రాష్ట్రాల పర్యాటక మంత్రులతో గ్రూప్ ఫోటో దిగారు.






