
Guntur:Tenali:-అధైర్యం వద్దు… ప్రతి గింజ కొంటాం అని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో మొంథా తుఫానుకు దెబ్బతిన్న వరి పొలాలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాతో కలిసి మంత్రి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాలు ఎక్కువ వస్తుందని, పంట నష్టం కలుగుతుందని రైతులు తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 24 వేల హెక్టార్ల పంట నీటి ముంపుకు గురై దెబ్బతిందని, 6 వేల హెక్టార్ల పంట తెనాలి నియోజకవర్గంలో దెబ్బతిందన్నారు. రైతు బాధ వర్ణనాతీతం అన్నారు. ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
రైతుకు భరోసా లభిస్తుందని చెప్పారు. రైతులు తుఫానుకు తరచూ గురి అవుతున్నారని, ఈ తరుణంలో ఉద్యాన పంటలకు మారాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఇతర జిల్లాల్లో ఆయిల్ పామ్, కోకో వంటి వాణిజ్య పంటలకు మల్లడం జరిగిందని చెప్పారు. ప్రతి గింజ కొంటామని, రైతుకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో నగదు చెల్లింపు జరుగుతోందని, రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
ఇ. క్రాప్ బుకింగ్ కు ఏర్పాట్లు చేస్తామని, కౌలు రైతులకు ఎటువంటి సమస్య లేకుండా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వర రావు, స్థానిక నాయకులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.







