ఇబ్బందుల్లో ఉన్న ఉల్లి రైతును ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి ఉల్లిని తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం నుంచే క్వింటాకు రూ.1200 చెల్లించి ఉల్లిని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై గురువారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, మార్కెటింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. ఉల్లి రైతుల పరిస్థితి, ఉల్లి ధరలు ఏ మేరకు ఉన్నాయనే అంశంపై చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఉల్లి పంటకు సంబంధించిన క్రయ విక్రయాలపై అంశంపై చర్చించారు. ఉల్లి పంట దెబ్బ తిన్న కారణంగా.. మహారాష్ట్ర ఉల్లి పంట ఎక్కువగా ఉన్న కారణంగా ధరల విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. వచ్చే పది రోజుల్లో 5 వేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వచ్చే అవకాశం ఉందని సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకూడదు. క్వింటా ఉల్లిని రూ. 1200 చొప్పున కొనుగోలు చేయండి. తక్షణం కొనుగోళ్లు ప్రారంభించాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి నష్టాన్ని భరించాలి. కమ్యూనిటీ హాళ్లల్లో అద్దెకు తీసుకుని ఆరబెట్టాలి. ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లకు పంపిణీ చేయాలి. ఉల్లికి రేటు వచ్చేంత వరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలి. రైతు నష్టపోకూడదు.. వినియోగదారుడు ఇబ్బంది పడకూడదు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి అన్నారు.
238 1 minute read