
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టయ్యారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి సిట్ బృందం వెళ్లింది. అనంతరం జోగి రమేశ్తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. రమేశ్ ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.జోగి రమేశ్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు. తనకు రూ.3 కోట్లు సాయం చేస్తానని రమేశ్ హామీ ఇచ్చారని, ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టడంతోనే ఇందులోకి దిగానని జనార్దన్రావు చెప్పాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ములకలచెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకుని నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టమని సూచించారని పోలీసులకు జనార్ధనరావు చెప్పినట్లు తెలిసింది. జోగి మంత్రిగా ఉన్న సమయంలో 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామన్నాడు. ఈ మేరకు రాతపూర్వకంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇంటరాగేషన్ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు వీడియో చిత్రీకరించారు. ఆఫ్రికా వెళ్లే ముందు సెప్టెంబర్ 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లినట్లు చెప్పడంతో దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలోనే జోగి రమేశ్ ఇంటికి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు.







