రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న 218 మార్కెట్ కమిటీల స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి కె.అచ్చెన్నాయుడు, వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్ ఛైర్మన్లు, ఉన్నతాధికారులు హజరయ్యారు. ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు.
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రాస్ వాల్యూ అడిషన్ పై సీఎం దిశా నిర్దేశం చేశారు. అలాగే ఈ నెల 11వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్న పీఎం ధన్ ధాన్య కృషి యోజనపై కూడా సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”రైతులకు లాభం రావాలి… వినియోగదారునికి ప్రయోజనం కలగాలి. ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పని చేయాలి.
రైతు బజార్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. పత్తికొండలో ఇటీవల కాలంలో టమాటో పంటకు ధర తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పంటను రైతు బజార్లకు తరలించి.. వినియోగదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. కోల్డ్ చైన్ లాంటి వ్యవస్థలను ఉపయోగించుకుని టమాటో పంటలకు ధర తగ్గకుండా చూసుకోవాలి. రైతు బజార్లను ఆధునీకరించాలి. అర్బన్ ప్రాంతాల్లో రైతు బజార్ల ఆధునికీకరణకు భూమి ఎంత వరకు అవసరమవుతుందో అంచనా వేయాలి. రైతు బజార్లకు అనుసంధానంగా మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. మార్కెట్ కమిటీలను, రైతు బజార్లను అనుసంధానం చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
దీని ద్వారా నిధుల సమీకరణ చేపట్టి… వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన జరిగేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ కోల్డ్ చైన్, అగ్రి ప్రాసెసింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి.” అని సీఎం ఆదేశించారు.