
75 ఏళ్ల భారత రాజ్యాంగంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రధానిగా నరేంద్ర మోదీ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు.. సంస్కరణల తర్వాత ప్రజల ఆలోచనా విధానం మారింది… పరిస్థితులు మారుతున్నాయి. చాలా దేశాలు యువత లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి… కానీ భారత దేశానికి అలాంటి సమస్య లేదు. మన దేశంలో పెద్ద ఎత్తున మానవ వనరులు అందుబాటులో ఉంది. భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలిపేలా ప్రధాని పని చేస్తున్నారు. 2047 నాటికి ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రభావం చూపే స్ధాయికి చేరుకుంటారు. సమాజంలో ఏమైనా తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని రక్షించేది న్యాయ వ్యవస్థదే. సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ ఎడిటర్ అయిపోతున్నారు… వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు. నేషన్ ఫస్ట్ అనే విధంగా అందరూ ఆలోచన చేయాలి. వన్ పర్సన్ – వన్ ఓట్.. అనేది అంబేద్కర్ ఇచ్చిన వరం. కొన్ని దేశాల్లోని ఓటర్లకు సమాన హక్కులు ఉండవు.ఓటు హక్కు విషయంలో పేద-ధనిక, లింగ బేధాలు లేని దేశంగా భారతదేశం ఉంది. సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ ఉండే సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం కన్పిస్తోంది… ఈ రకమైన సమానత్వాన్ని సాధించడానికి పబ్లిక్ పాలసీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐటీని ప్రమోట్ చేయాలని విధాన నిర్ణయం తీసుకున్నాం.. హైదరాబాద్ అభివృద్ధే దానికి నిదర్శనం. ఇంకా పేద-ధనిక తారతమ్యాలు ఉన్నాయి… ఈ అంతరాలను తగ్గించేలా అందరూ ఆలోచన చేయాలి. అందరికీ సమాన అవకాశాలు కలిగేలా చేయగలిగితే… ఈ తారతమ్యాలు మాయం అవుతాయి. అందుకే నేను హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నాం.. దీనికి అందరి నుంచి సహకారాన్ని కోరుతున్నా. ప్రధాని మోదీ కూడా వసుధైక కుటుంబం గురించే మాట్లాడతారు… ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కర్నీ మన కుటుంబ సభ్యులుగానే భావించాలి. వసుధైక కుటుంబం భావన ఉండాలి… అలాగే ఒకరి సార్వభౌధికారంలో వేరే వారు జోక్యం చేసుకోకుండా పరిధులు దాటకుండా ఉండాలి. ఈ విధానాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. జస్టిస్ గవాయ్ లాంటి వారు దేశాభివృద్ధి కోసం నిరంతరం గైడ్ చేస్తూనే ఉండాలని సూచించారు.







