
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పిపిపి విధానంలో ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ జనవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ లో జరగనున్న సామూహిక నిరసన దీక్షలో రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, దళిత, గిరిజన, బహుజన ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ప్రభుత్వ మెడికల్ పరిరక్షణ కమిటి రాష్ట్ర కన్వీనర్ డా|| ఆలా వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఈనెల 3వ తేదీ గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జరిగిన మీడియా సమావేశంలో సామూహిక నిరసన దీక్ష పోస్టర్ ను ఆవిష్కరించారు. డా || ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ ప్రైవేట్ అంటేనే లాభాపేక్ష అని, పిపిపి విధానం విద్యార్థులు, రోగులపై భారాన్ని మోపుతుందన్నారు . ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్యం కోట్లాది మందికి ఉచితంగా మెరుగైన ఫలితాలను అందిస్తుందనేదానికి ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎం లాంటి సంస్థలే నిదర్శనమన్నారు. శాసనమండలి మాజీ సభ్యులు కె. ఎస్.లక్ష్మణరావు ప్రసంగిస్తూ అత్యధిక అసమానతలున్న సమాజంలో విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ చేస్తే అసమానతలు మరింత పెరుగుతాయని తెలుపుతూ ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలు కొనసాగాలన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కో – కన్వీనర్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిపిపి విధానాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కోవిడ్ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు కేవలం 2 శాతం వ్యాక్సిన్లు అందించాయని, ఆ సమయంలో ప్రభుత్వ వైద్యరంగంమే ప్రజల ప్రాణాలను నిలిపిందన్నారు. దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు, రాష్ట్ర కో – కన్వీనర్ కొరివి వినయ్ కుమార్ ప్రసంగిస్తూ ప్రజారోగ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ తో బలహీనపరిచే దిశగా నడుస్తుందని ప్రభుత్వం భేషజాలకు పోకుండా ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలను కొనసాగించక పోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదన్నారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ.ఆర్ సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ మెడికల్ కళాశాలలను పిపిపి విధానంలో కొనసాగిస్తే రిజర్వేషన్లకు మంగళం పాడినట్టేనని, సామాజిక న్యాయానికి తూట్లు పోడవడమేనని తెలిపారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ దేవుడా రక్షించు నా దేశాన్ని అని బాలగంగాధర్ తిలక్ గీతాన్ని గుర్తుచేస్తూ నేటి పాలకులు ప్రజల కనీస వైద్య అవసరాలను నెరవేర్చేందుకు వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నారు. మీడియా సమావేశంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు డి. చంద్ర నాయక్, ఎస్. ఆర్. శంకరన్ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు బత్తుల కోటేశ్వరరావు, బీసీ మహాజన సభ రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.







