
అమరావతి: నవంబర్ 30:-ఆంధ్రప్రదేశ్‌ను సినిమా షూటింగ్‌లు, పర్యాటకం రెండింటికీ జాతీయ–అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముందడుగు వేస్తున్నారు. ఈ దిశగా డిసెంబర్ 1–2 తేదీల్లో ముంబయి జుహూలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో జరగనున్న ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్–2025’లో పాల్గొనడానికి మంత్రి ఆదివారం జమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్ నుండి ముంబయి బయలుదేరారు
.“ది ఏఐ ఎరా – బ్రిడ్జింగ్ క్రియేటివిటీ అండ్ కామర్స్” థీమ్‌తో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌లో దేశ–విదేశాలకు చెందిన మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు పాల్గొననున్నారు. ఈ వేదికలో ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త ‘ఫిల్మ్ టూరిజం పాలసీ’ వివరాలను మంత్రి దుర్గేష్ ప్రస్తావించనున్నారు.రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, పోస్ట్–ప్రొడక్షన్ యూనిట్లు స్థాపన అవసరాన్ని వివరించడంతో పాటు పెట్టుబడిదారులను ఏపీలో అవకాశాలు వినియోగించుకోవాలని మంత్రి కోరనున్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం అందించే ఇన్సెంటివ్‌లు, రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ఈ సమ్మిట్‌లో వెల్లడించనున్నారు.సినిమాల ద్వారా పర్యాటకాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చన్న దానిపై కూడా దుర్గేష్ కీలకోపన్యాసం చేసే అవకాశముంది. ఏపీలోని చారిత్రక కట్టడాలు, ప్రకృతి సోయగాలను వెండితెరపై ప్రదర్శించడం ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.భారతీయ మీడియా–ఎంటర్టైన్మెంట్ రంగాన్ని $100 బిలియన్ల స్థాయికి చేర్చడంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని, రాష్ట్రాన్ని సృజనాత్మక రంగానికి ప్రధాన కేంద్రంగా మార్చి **‘ఆంధ్రా వ్యాలీ’**గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి దుర్గేష్ తెలిపారు.







