
గుంటూరు :వెంగళాయపాలెం:11-11-25:-ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు కేటాయించింది. రూ.358.82 కోట్లతో 97 గ్రామీణ రహదారులు, 33 వంతెనల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం ప్రకటించారు.గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో జాతీయ వాటర్ షెడ్ మహోత్సవం సందర్భంగా చెరువును జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆమోద పత్రాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి డీ.ఓ.లేఖ రూపంలో అందజేశారు.
ప్రధానమంత్రి జన్ మన్ పథకం కింద మంజూరైన ఈ ప్రాజెక్టులు ప్రధానంగా ప్రత్యేకంగా బలహీన గిరిజన వర్గాలు (PVTGs) నివసించే ప్రాంతాల్లో రహదారి కనెక్టివిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా ఉన్నాయి. రహదారులతో పాటు విద్యుత్, ఆరోగ్య సేవలు, అంగన్‌వాడీ సదుపాయాల అందుబాటును పెంచుతాయని చౌహాన్ తెలిపారు.ఈ ప్రాజెక్టులు సర్వతోముఖ అభివృద్ధి, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. మంజూరు పత్రాల జారీ తేదీ నుండి 7 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, 2025-26 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సువర్ణ ఆంధ్ర – వికసిత భారత్ దిశగా గ్రామీణ జీవితాలను మారుస్తున్నాయని మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అభినందించారు.







