
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వర్షం కురిపించేందుకు మరో అంతర్జాతీయ దిగ్గజం ముందుకొచ్చింది. న్యూయార్క్‌లో ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ గ్లోబల్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టిజిహెచ్) రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది.న్యూఢిల్లీలో జరిగిన యుఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ సమ్మిట్ లో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమ్మిట్ సందర్భంగా టిజిహెచ్ పెట్టుబడుల ఒప్పందం కుదిరింది.
సమ్మిట్‌లో మాట్లాడుతూ అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్ ఈ భారీ పెట్టుబడికి తాను సంధానకర్తగా వ్యవహరించినట్లు వెల్లడించారు. అనంతరం టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ చైర్మన్ & సీఈఓ సంజీవ్ అహూజా మంత్రి లోకేష్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులతో అవగాహన ఒప్పంద పత్రాలను (MoU) పంచుకున్నారు.ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్లు, టెలికాం సదుపాయాల విస్తరణకు నూతన ఊపిరి అందనుంది. పరిశ్రమల రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా నిలబెట్టేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.







