ఆంధ్రప్రదేశ్

AP NEWS: జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు – ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తి రావాల్సిందే

CM CHANDRABABU MEETING

జూన్ 12 తరువాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ప్రతివారం నాలుగు శాఖల పరిధిలో పథకాలు, సేవలపై ప్రజలనుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను సమీక్షిస్తున్న సీఎం… రేషన్, దీపం, ఎపిఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించారు. ఈ శాఖల పరిధిలో అమలు అవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఐవిఆర్ఎస్, క్యూ ఆర్ కోడ్ వంటి విధానాల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ అభిప్రాయాలపై సిఎస్, సిఎంవో సెక్రటరీలతో ముఖ్యమంత్రి చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుందని… అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజా సేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించాలని సిఎం అన్నారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని… అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని సిఎం అన్నారు. దీపం 2 పథకం ద్వారా లబ్దిదారులకు ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామని సిఎం అన్నారు. లబ్దిదారులు తమకు కావాల్సినప్పుడు దీపం పథకం కింద సిలిండర్ పొందవచ్చు… అయితే వారికి మూడు సిలిండర్లకు ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తుంది. దీపం పథకం లబ్దిదారుల నుంచి ఏజెన్సీ వాళ్లు కానీ, ఇతర స్థాయిల్లో గాని ఎక్కడా డబ్బులు అదనంగా వసూలు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు. మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా… అని ప్రశ్నించగా 74 శాతం మంది అవునని, వాటి నాణ్యతపై ఎలా ఉంది అంటే బాగుందని 76 శాతం మంది చెప్పారు. రేషన్ పంపిణీలో, నాణ్యతపై ప్రజల సంతృప్తిలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. అదే విధంగా గ్యాస్ డెలివరీ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారా… అనే అంశంలో 62 శాతం మంది లేదు అని చెప్పారు. పలు చోట్ల ఈ విషయంలో సమస్య ఉందని…. నేరుగా వారి ఖాతాల్లో ముందుగానే డబ్బులు వేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఆర్టీసీ సేవల విషయంలో ప్రయాణికుల నుంచి ఆశించన స్థాయిలో సంతృప్తి వ్యక్తం కాలేదని… ఈ విషయంలో అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సిఎం అన్నారు. బస్స్టాండ్‌లలో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ విషయంలో ప్రయాణికుల నుంచి అసంతృప్తి వస్తోందని దీన్ని సరిచేసుకోవాలని సిఎం అన్నారు. తాగునీటిపై 44 శాతం, టాయిలెట్లపై 55 శాతం మంది అసంతృప్తి వెల్లడించారు. ఇక పంచాయతీ సేవల విషయానికి వచ్చేసరికి… ఇంటి నంచి చెత్త సేకరణ జరుగుతుందా అనే ప్రశ్నకు 60 శాతం మంది అవుననే చెప్పారు. గతంతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైందని సిఎం అన్నారు. రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు తడిచెత్త నిర్వహణ బాధ్యత అప్పగించి… కంపోస్ట్ తయారీ చేపడతామని సిఎం అన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker