
నాటక రంగానికి కూటమి ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకువస్తామని, కవులు, కళాకారులను ప్రోత్సహించి వారిలో ప్రతిభకు సానపెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీ.వి. మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి 177వ జయంతిని పురస్కరించుకుని తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కందుకూరి పురష్కారాలను నాటకరంగ లబ్ధప్రతిష్టులకు అందచేశారు. ముందుగా ముఖ్య అతిధులు కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నాటకరంగ కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఏడాది నుండి కూటమి ప్రభుత్వం నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను పున:ప్రారంభించనున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత ఐదేళ్లలో కళారంగంను అధోపాతాళానికి పడిపోయిందన, కవులు, కళాకారులను పట్టించుకున్న వారే లేరని విమర్శించారు. ఎక్కడైతే కవులు, కళాకారులు సంతోషంగా ఉంటారో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. శ్రీకృష్ణదేవరాయల సభలో అష్టదిగ్గజాలకు స్థానం కల్పించడంతో పాటు కళాకారుల్లోని ప్రతిభను గుర్తించి వారిని సముచితంగా సత్కరించేవారని, అందుకే రాయల వారి పాలన గురించి నేటికీ చెప్పుకుంటున్నామని గుర్తుచేశారు. నేటి యువత ఓటీటీలపై మొగ్గు చూపుతున్నారని, కాని అసలైన ఆనందం పద్య, గద్య నాటకాల్లో ఉందన్న విషయం మనం వారికి అవగతమయ్యేటట్లు చెప్పగలిగితే ఫలితం ఉంటుందని, యువత నాటక రంగంపై ఆసక్తి కలిగేవిధంగా సాంఘిక, ఆధునిక నాటకాలకు పెద్దపీట వేయాలని మంత్రి దుర్గేష్ అన్నారు.








