AP NEWS: మనమిత్రను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి – అన్ని సేవలూ ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్‌లో అందించాలి
AP CS MEETING WITH OFFICIALS
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి, ప్రభుత్వ సేవలన్నీ వారు మనమిత్రలో పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయన సోమవారం ఆర్టీజీఎస్ కార్యకలాపాలపైన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్ సేవల ప్రగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూన్ 12వ తేదీలోపు మనమిత్ర ద్వారా ప్రజలకు 500 రకాల సేవలు ఇచ్చేలా అధికారులు పనిచేయాలన్నారు. ప్రజలు ఎవ్వరూ కూడా తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగనవసం లేకుండా అన్ని సేవలు మనమిత్ర ద్వారా పొందేలా చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. ఆ దిశగా మనమిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడంలో సచివాలయ సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్నారు. ఆర్టీజీఎస్‌లో డేటా అనుసంధాన ప్రక్రియ కూడా లక్ష్యాల మేరకు పూర్తయ్యేలా చూడాలన్నారు. డేటా అనుసంధానంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేలా ఆర్టీజీఎస్ సాంకేతిక సహకారాన్ని ఆయా శాఖలకు అందించడానికి వీలవుతుందన్నారు. పంచాయతీరాజ్ విభాగాధికారులనుద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం, చెత్తతొలగింపు పనుల్లో కొంత పురోగతి కనించిందని, అయితే పారిశుద్ధ్య మరింత మెరుగుపడాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా కనిపించేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ఆర్టీసీ సేవల్లో కూడా మరింత ప్రగతి సాధించాలని సూచించారు. డ్రోన్ మార్ట్ వెబ్ పోర్టల్‌ను ముఖ్యమంత్రి చేతులమీదు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పోర్టల్‌ను రూపొందించాలని సూచించారు.