AP NEWS: రాష్ట్రంలో మరమ్మతులు చేయడానికి వీల్లేని రహదారుల అభివృద్ధికి రూ. 600 కోట్లు కేటాయింపులు : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
ROADS DEVELOPMENT IN AP
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మెరుగైన రహదారులే లక్ష్యంగా రూ. 600 కోట్లతో రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా ధ్వంసమైన రహదారులు – ఇంకా మరమ్మతులు చేయాల్సి ఉన్న రోడ్లను ప్రాధాన్యత క్రమంలో తిరిగి మెరుగైన రహదారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.. జిల్లా ప్రధాన రహదారులు (MDR), రాష్ట్ర హైవేలు (SH) పథకం కింద రోడ్లు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజలకు మెరుగైన రహదారులను అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రోడ్ల అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే రూ. 861 కోట్లతో దాదాపు 20 వేల కి.మీ రోడ్లను గుంతల రహితంగా నిర్ణీత కాల వ్యవధిలో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ప్రస్తుతం గుంతలు పూడ్చడానికి వీలులేని విధంగా పూర్తిగా ధ్వంసమైన రాష్ట్ర హైవేలు, జిల్లా ప్రధాన రహదారులను తిరిగి పునర్ నిర్మించేందుకు నిధులు కేటాయించాలనే ప్రతిపాదనలు స్థానికంగా ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి పెద్ద ఎత్తున రావడం జరుగుతుందన్నారు.. ఈ క్రమంలో సీ కేటగిరీ (బాగా దారుణంగా దెబ్బ తిన్న రోడ్లు) కింద ఈ రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ. 600 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.