
గ్రామీణ ఆంధ్రప్రదేశ్ బలోపేతం దేశానికి అవసరం. వికసిత్ భారత్ అనే మహా లక్ష్యంలో గ్రామీణాంధ్ర ప్రదేశ్ కీలకం. పంచాయతీల స్వయం ప్రతిపత్తి సాధన లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు వెళ్తోంద’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాల సమగ్రాభివృద్ధి ద్వారా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, వలసలు అరికట్టడం, ఆహార భద్రత వంటి లక్ష్యాల సాధన సాధ్యపడుతుందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంలో ఆర్థిక సంఘం సహకారం ఎంతో అవసరమని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పర్యావరణహితంగా, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆర్థిక సంఘం సహాయ సహకారాలతో పని చేస్తామన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తామంతా కంకణబద్దులై ఉన్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య సాధనకు 16వ ఆర్థిక సంఘం పూర్తి స్థాయిలో సహకరిస్తుందనే ఆకాంక్షను వెలిబుచ్చారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ డా.అరవింద్ పనగరియా గారు, ఇతర సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పక్షాన తొమ్మిది అంశాలతో కూడిన ప్రతిపాదనలను ఆర్థిక సంఘం ముందుకు ఉంచారు.








