
అమరావతి:04.11.2025:-లండన్‌లో జరుగుతున్న ప్రపంచ పర్యాటక మహాసదస్సు వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)-2025 వేదికపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రతిష్టను ప్రతిధ్వనింపజేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన భారత పర్యాటక స్టాల్‌ను డిప్యూటీ హై కమిషనర్, వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులతో కలిసి ప్రారంభించిన మంత్రి దుర్గేష్, అనంతరం రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా కూచిపూడి నృత్యంతో ఏపీ స్టాల్‌ను ఆవిష్కరించారు.

ప్రపంచ దేశాల ప్రతినిధులతో రాష్ట్ర పర్యాటక అవకాశాలపై విస్తృత చర్చలు జరిపిన మంత్రి దుర్గేష్ – 20కి పైగా అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లు, హోటల్స్ ప్రతినిధులు, మైస్ ఇన్వెస్టర్లు, ట్రావెల్ మాగజైన్స్ యజమానులు, మీడియా బ్లాగర్లు, అడ్వెంచర్ ట్రావెల్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.రాష్ట్రంలోని ప్రకృతి అందాలు, చారిత్రాత్మక కోటలు, తీర ప్రాంత సౌందర్యం, వారసత్వ సంపద వంటి అంశాలను ఏపీ స్టాల్ ద్వారా అంతర్జాతీయ వేదికపై ప్రచారం కల్పించారు.

స్టాల్ సందర్శించిన విదేశీ ప్రతినిధులను కూచిపూడి నృత్యంతో ఆహ్వానించి, అరకు కాఫీని అందజేశారు. ఆంధ్రప్రదేశుకు ప్రత్యేక గుర్తింపుగా పూతరేకులు రుచి చూపించగా, జీఐ ట్యాగ్ పొందిన ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలను ప్రదర్శించి వాటి తయారీ విధానాన్ని వివరించారు.

తరువాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ – “రాష్ట్రంలో నూతన పర్యాటక పాలసీ 2024–29 అమలు చేస్తున్నాం. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. ఏపీలో పర్యాటక పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి పూర్తి భరోసా కల్పిస్తాం” అన్నారు.పికాక్ టూర్ కంపెనీ సీఈఓ కన్నన్ శివనాథన్, సిగ్నేచర్ హాస్పిటాలిటీ గ్రూప్ సీఈఓ రమేశ్ అరోరా, రష్యా సహా పలు దేశాలకు చెందిన టూరిజం ప్రతినిధులతో కూడా మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన డిన్నర్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ – “ఏపీ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేయడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టూరిజం మ్యాప్‌పై సగర్వంగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది” అని స్పష్టం చేశారు







