
గత ఐదేళ్ల పాటు కుదేలైన సాగునీటి రంగాన్ని కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ప్రగతి పథంలో పయనింప చేస్తున్నారని సాగునీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సాగునీటి ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమిస్తోంది. 17 నెలల కాలంలోనే సాగునీటి రంగాన్ని ప్రగతి పథంలో నిలబెట్టాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సాగునీటి రంగ ఎన్నికలు నిర్వహించాం. గత ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు, డ్యామ్‌లు, కాలువల మరమ్మతులు, రిపేయిర్లకు కూడా నిధులు కేటాయించలేదు. సాగునీరు సక్రమంగా పారక చివరి ఆయకట్టు నీరు అందలేదు. జగన్ పాలనలో ప్రతి నియోజకవర్గంలో 5 వేల ఎకరాల నుంచి 20 వేల ఎకరాల వరకు సాగు దిగుబడి తగ్గిపోయింది. వ్యవసాయం కుంటుపడి దిగుబడి తగ్గిపోయింది. రైతులు వలసబాట పట్టేలా జగన్ ప్రభుత్వం చేసిందని తెలిపారు.







