
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ లీగల్ సెల్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు జిల్లా కోర్టు వద్ద కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 నియోజకవర్గాల్లో 12న ర్యాలీలు చేపట్టి కలెక్టర్లు, ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. వ్యాపార ప్రక్రియలో వైద్యరంగాన్ని విస్తరిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం దేవుణ్ణి అడ్డుపెట్టుకొని దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తోందని రాంబాబు ధ్వజమెత్తారు. టీటీడీ భోజనం అనేది ఆనవాయితీగా వస్తుందని, ఆ భోజనం అద్భుతంగా ఉందన్న మాత్రానా చంద్రబాబు, బి.ఆర్ నాయుడును పొగిడినట్లు కాదని స్పష్టం చేశారు. లోకేశ్ నిద్రపోతున్నా జగన్ కలలోకి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జగన్‌కి ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా, లీగల్ సెల్ నాయకులు పోలూరి వెంకట్ రెడ్డి, సీ.డీ భగవాన్, కొమ్మారెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







