
బీసీ రిజర్వేషన్లు పెంచి హామీలను నెరవేర్చాలని. శీలం వెంకటేశ్వర్లు డిమాండ్.

ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చీరాల ఆధ్వర్యంలో సోమవారం బాపట్ల జిల్లా చీరాలలోని కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీసీ నవ్య చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శీలం వెంకటేశ్వర్లు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు ఎటువంటి పదవులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అధిక సంఖ్యలో ఓటర్లు బీసీలు ఉన్నప్పటికీ, వారికి న్యాయం జరగడం లేదని అన్నారు. బీసీ సంక్షేమ నిధులు సరైన విధంగా కేటాయించకపోవడం, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పిన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధోరణిలో కొనసాగిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లు పెంచి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శీలం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.








