
మహారాజశ్రీ ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పిర్యాదు అందజేశారు. ఈ పిర్యాదులో, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముప్ట్ బిజిలి యోజన పథకంలో ఎస్.సి. సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద గృహాలపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి, 200 యూనిట్లు ఉచితంగా అందించే నిర్ణయం ప్రభుత్వంచే తీసుకోవడం మంచిదే అని పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో అత్యధిక జనాభా, గృహాలు కలిగిన ఎస్.సి. వర్గానికి ప్రత్యేక ప్రయోజనాలు కల్పించకపోవడం అన్యాయమని అన్నారు. గతంలో బి.పి.ఎల్ కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించినా, ఈ స్కీమ్‌లో అదనపు లాభం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దేశ చరిత్రలో ఎస్.సి. వర్గం అనేక శతాబ్దాలు చీకటిలో గడిపిందని, డా. బి.ఆర్. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుల వలననే నేడు వెలుగులో జీవిస్తున్నామని గుర్తుచేశారు. కానీ ప్రభుత్వం ఇంకా చిన్న చూపుతో వ్యవహరిస్తోందని విమర్శించారు. బి.సి. వర్గానికి ప్రభుత్వం 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లే, ఎస్.సి. వర్గానికి 50 వేల రూపాయలు ఇచ్చి చట్టబద్ధ రీతిలో సమాన హక్కులు కల్పించాలని కోరారు.
ఈ డిమాండ్లను అంగీకరించకపోతే, న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. కలెక్టర్ గారు ఈ సమస్యపై స్పందించి, ఎస్.సి. వర్గానికి పి.ఎమ్. సూర్యఘర్ ముప్ట్ బిజిలి యోజన పథకంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పిర్యాదుదారులు విజ్ఞప్తి చేశారు.







