
అమరావతి: అక్టోబర్ 28:జాతి నిర్మాణం, దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి పిలుపునిచ్చారు. నీరుకొండలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మంగళవారం జరిగిన 5వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ప్రొఫెసర్ మధుమూర్తి మాట్లాడుతూ — ఉన్నత విద్య పూర్తిచేసిన ప్రతి విద్యార్థి సమాజంలో బాధ్యత గల పౌరుడిగా ఎదగాలని సూచించారు. ప్రపంచస్థాయి సంస్థల్లో కీలక పాత్ర పోషించేందుకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యం అలవర్చుకోవాలని ఆహ్వానించారు. ఎస్ఆర్ఎం వంటి అంతర్జాతీయ స్థాయి వర్సిటీల్లో చదివిన విద్యార్థులకు టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తరఫున స్నాతకోత్సవానికి హాజరైనట్లు పేర్కొంటూ, మంత్రి లోకేష్ విద్యార్థులకు తన అభినందనలు మెసేజ్ ద్వారా పంపినట్లు వెల్లడించారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా ప్రభుత్వం విజనరీ రోడ్‌మ్యాప్‌తో ముందుకు సాగుతోందని, విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ మంజూరు కావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.యూనివర్సిటీ కులపతి డాక్టర్ టి.ఆర్. పారివేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ — ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని, ఆయన ప్రేరణతోనే ఏపీలో ఎస్ఆర్ఎం వర్సిటీ స్థాపించామని అన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభను చాటుతున్నారని తెలిపారు.

యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, విద్యార్థులు శాంతి, సహనంతో విజయ సోపానాలు అధిరోహించాలని సూచించారు. వైస్ చాన్సలర్ డాక్టర్ సతీష్ కుమార్ వార్షిక నివేదికను సమర్పించారు.ఈ సందర్భంగా 2020–25 విద్యా సంవత్సరానికి చెందిన బీటెక్, పీహెచ్‌డీ, బీఏ, బీకాం కోర్సులు పూర్తి చేసిన 1,877 మంది విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. ప్రతిభ గల విద్యార్థులకు బంగారు, వెండి పతకాలు ప్రదానం చేశారు. అనంతరం కులపతి పారివేందర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో ఎస్ఆర్ఎం ట్రస్ట్ సభ్యురాలు మణిమంగై, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి. నారాయణరావు, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రేమ్ కుమార్, డీన్లు డాక్టర్ విష్ణుపత్, వినాయక కల్లూరి, డాక్టర్ ఎన్వి రమణ రావు, డాక్టర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.







