
బాపట్ల: 11-12-2025:-బాపట్ల ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నేతృత్వంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. బాపట్ల నుంచి కలెక్టర్ వినోద్ కుమార్ స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీక్షణ మందిరం నుంచి సమావేశంలో పాల్గొన్నారు.
సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ — ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, ఇంటి వద్ద చెత్త సేకరణ, దీపం-2, చౌకదర దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ, ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు, వరిధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణలో వెనుకబడిన జిల్లాలు పనితీరులో మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే నాలుగో విడత కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్న అంశాలపై ఆయన విపులంగా వివరించారు.ఈ సందర్భంగా జిల్లాలో అద్దంకి, బాపట్ల, చీరాల ఆర్టీసీ డిపోలను నవీకరణ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నట్లు కలెక్టర్ వినోద్ తెలిపారు. బాపట్లలో ఓల్డ్ బస్టాండ్, న్యూ బస్టాండ్ ఉన్నప్పటికీ ప్రజలు అధికంగా పాత బస్టాండ్‌ను ఉపయోగిస్తున్నారని, న్యూ బస్టాండ్ విస్తీర్ణం చిన్నదని పేర్కొన్నారు. బస్టాండ్ సౌకర్యాలపై ప్రయాణికుల నుండి నేరుగా అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పారు. సీటింగ్ ఏర్పాట్లు, మరుగుదొడ్ల సౌకర్యం బాగున్నట్టు తెలిసిందని కలెక్టర్ వివరించారు.వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర గౌడ్, పౌర సరఫరాల అధికారి జమీర్ భాష, బాపట్ల డిఎల్డిఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







