
ఈ నెల 24,25,26 వ తేదిలలో ఒంగోలు నగరంలో జరుగు ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్లూజే) 36 వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు జర్నలిస్ట్ లోకానికి పిలుపునిచ్చారు.
యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఐవి సుబ్బారావు బుదవారం మార్కాపురం,కనిగిరి, వై పాలెం, పొదిలి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన యూనియన్ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రాజిలేని పోరాటాలను కొనసాగిస్తున్న యూనియన్ తమదేనని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఆక్రిడిడేషన్, నివాస స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఇప్పటికే పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగిందని గుర్తు చేశారు.
రాష్ట్ర మహాసభల్లో మొదటి రోజు సోషల్ మీడియా… విశ్వసనీయత అనే అంశంపై సెమినార్ జరగనుందని, ఈ కార్యక్రమానికి ఐజేయు అధ్యక్షులు, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఏపి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ లతో పాటు పలువురు మేధావి వర్గం హాజరు కానున్నారని తెలిపారు. అదే రోజు సాయంత్రం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందని అన్నారు.
25 వ తేది ఉదయం 10 గంటలకు మహాసభ ప్రారంభం కానుందని, పలువురు రాష్ట్ర మంత్రులు, సమాచార శాఖ కమిషనర్, జిల్లాల్లోని ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు.
ఈ మహాసభలకు ఐజేయు నాయకత్వం, రాష్ట్రంలోని అన్ని జిల్లాల యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు, రాష్ట్ర, జాతీయ కౌన్సిల్ సభ్యులతో పాటు తమిళ నాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన యూనియన్ అగ్ర నాయకులు హాజరు కానున్నారని ఆయన తెలిపారు.







