మంగళగిరిలో ‘గ్రీన్ హైడ్రోజన్ – 2025’ సమ్మిట్ ఏర్పాట్ల పరిశీలన||Arrangements Reviewed for ‘Green Hydrogen – 2025’ Summit in Mangalagiri
మంగళగిరిలో ‘గ్రీన్ హైడ్రోజన్ – 2025’ సమ్మిట్ ఏర్పాట్ల పరిశీలన
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలోని ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ ఎ.పి.జె.అబ్దుల్ కలాం ఆడిటోరియంలో జూలై 18న జరగనున్న ‘గ్రీన్ హైడ్రోజన్ – 2025’ సమ్మిట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలి మరియు పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా కలిసి పరిశీలించారు.
కలెక్టర్, ఉన్నతాధికారులు సమ్మిట్ నిర్వహణకు అవసరమైన విభాగాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ముఖ్యంగా సభా స్థలి వద్ద సీటింగ్ ఏర్పాటు, పీఏ సిస్టమ్, మీడియా గ్యాలరీ తదితర అంశాల్లో నాణ్యత ప్రమాణాల మేరకు ఏర్పాట్లు ఉండాలని సూచనలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులతో నిర్వహించనున్న ముఖాముఖి సమావేశం ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ మూడో అంతస్తులో జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి సౌండ్ సిస్టమ్, సెక్యూరిటీ, లోగిస్టిక్స్ అంశాలను కూడా అధికారులు పర్యవేక్షించారు.
అనంతరం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌ను పరిశీలించి, యూనివర్సిటీ ఉన్నతాధికారులతో సమావేశమై, సమ్మిట్ విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమీక్ష కార్యక్రమంలో ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డి. నారాయణరావు, ప్రొ. వైస్ ఛాన్సలర్ సతీష్ కుమార్, రిజిస్ట్రార్ డా. ప్రేమ్ కుమార్, డైరెక్టర్ సి.ఎల్.ఎం అనూప్ సింగ్ సూర్య, ప్రోగ్రాం కన్వీనర్ డా. ఎం. పార్ధసారధి, పీఆర్ఓ జి. వేణుగోపాల్, అదనపు ఎస్పీ (ఇంటిలిజెన్స్) ఖాదర్ భాష, మంగళగిరి తహసీల్దార్ కె. దినేష్ రాఘవ, డీఎస్ఓ చంద్ర ముని, డీఎం అండ్ హెచ్‌ఓ డా. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమ్మిట్ ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పురోగతికి దారి చూపుతుందని, విద్యార్థులకు సైతం ఈ రంగంలో అవగాహన పెరగనుందని అధికారులు భావిస్తున్నారు.