
అమరావతి, నవంబర్ 5:-సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన పెంపు లక్ష్యంగా ఏపీ సైన్స్ సిటీ, సమగ్ర శిక్ష అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న “సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్ టు న్యూఢిల్లీ” కార్యక్రమానికి ఎంపికైన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నేడు విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.ఈ సందర్భంగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులను అభినందించారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపుతో పాటు సైన్స్, టెక్నాలజీపై ఆసక్తి కల్పించడమే ఈ టూర్ ఉద్దేశమని మంత్రి తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున మొత్తం 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ టూర్‌లో పాల్గొంటున్నారు. నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియం, రష్యన్ సైన్స్ అండ్ కల్చరల్ సెంటర్ వంటి ప్రముఖ సైన్స్ కేంద్రాలను విద్యార్థులు సందర్శించనున్నారు.మొదటిసారిగా విమానంలో ప్రయాణించే అవకాశం రావడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని తమ జీవితంలో మరువలేని అనుభూతిగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇలాంటి అరుదైన అవకాశాలు కల్పించడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ, “సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం గ్రామీణ విద్యార్థులకు కొత్త అవకాశాల ద్వారాలు తెరవడం గర్వకారణం. ఈ టూర్ మీలోని సృజనాత్మకతను వెలికితీసే వేదిక అవుతుంది” అన్నారు.

ఈ కార్యక్రమంలో I&I శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, సమగ్ర శిక్షా SPD శ్రీనివాస్, ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.







