విజయవాడ, సెప్టెంబర్ 17:వృద్ధుల హక్కులు, చట్టపరమైన రక్షణ, వారికి అందుబాటులో ఉన్న సేవలపై అవగాహన కల్పించేందుకు వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో, ఎస్‌బీఐ గరిమా ప్రాజెక్ట్ సహకారంతో ఒక అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మచిలీపట్నం జిల్లా న్యాయాధికార సేవా సంస్థ (DLSA) సెక్రటరీ శ్రీ కే.వి. రామకృష్ణయ్య సీనియర్ పౌరులతో ప్రత్యక్షంగా చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “వృద్ధులు సమాజంలో గౌరవనీయులు. అయితే వయసుతో వచ్చే సమస్యలు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వారి హక్కులను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆస్తులు బదిలీ చేసే సమయంలో వృద్ధులు వీలునామా లేదా బహుకరణ పత్రంలో ‘పోషణ నిమిత్తం’ అని రిజిస్టర్ చేయించుకుంటే రక్షణ లభిస్తుంది. నిరాదరణకు గురైతే వారు మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేసి భరణం పొందవచ్చు. ఎవరు నేరుగా రాలేకపోతే 15100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మేము మూడు నెలల్లోపు న్యాయం జరిగేలా చూస్తాం” అని స్పష్టం చేశారు.అలాగే ఆస్తి బదిలీల్లో కేవలం కొడుకులు, కూతుళ్లు మాత్రమే కాదు – కోడళ్ళు, అల్లుళ్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అదనంగా, SC, ST, మైనర్లు, వికలాంగులు, సంవత్సర ఆదాయం ₹3 లక్షల కంటే తక్కువవారికి ఉచిత న్యాయ సహాయం, అలాగే మహిళలకు వర్గం, ఆదాయం సంబంధం లేకుండా ప్రత్యేక వెసులుబాటు ఉందని తెలిపారు.వాసవ్య మహిళా మండలి ప్రతినిధి డా. కీర్తి మాట్లాడుతూ – “వృద్ధులకు మానసిక, శారీరక, ఆర్థిక భద్రత కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. గరిమా ప్రాజెక్ట్ ద్వారా వృద్ధులకు చట్టపరమైన అవగాహన కల్పించి అవసరమైన సేవలను అందించటం మా లక్ష్యం” అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు రావు, కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఏసీపీ ప్రసాద్, మహిళా సంరక్షణ కార్యదర్శులు, వాసవ్య మండలి ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, వృద్ధాశ్రమ వాసులు పాల్గొన్నారు. వృద్ధులు తమ సమస్యలు పంచుకోగా, న్యాయవేత్తలు వాటి పరిష్కార మార్గాలను సూచించారు.
211 1 minute read