
విజయవాడ: జనవరి 10:-తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతి, రుచులకు ప్రతీకగా నిలిచిన ‘అమరావతి ఆవకాయ్’ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ వేదికలుగా మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ముగింపు వేడుకలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్‌ను రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక బ్రాండ్‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఏటా ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగా 2026 డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

కళలకు పునర్వైభవం – త్వరలో నంది నాటకోత్సవాలు
గత ప్రభుత్వ హయాంలో కళలు, సంస్కృతి నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి దుర్గేష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాకారులకు ప్రాధాన్యం ఇస్తూ కందుకూరి, ఉగాది పురస్కారాలను పునరుద్ధరించామని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నంది నాటకోత్సవాలు నిర్వహించి, నంది అవార్డుల ప్రదానం చేస్తామని స్పష్టం చేశారు.
టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో నాటకం, సినిమా, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత ప్రస్థానంపై జరిగిన చర్చా కార్యక్రమం, దర్శకులు కోదండరామిరెడ్డి, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పాల్గొన్న ‘సాహిత్యం–సినిమా’ చర్చలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ప్రదర్శించిన కురుక్షేత్ర పద్యాల ఆలాపన, ఏకపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. వెంట్రిలాక్విజం ప్రదర్శనలు పిల్లలు, యువతను అలరించాయన్నారు.
ప్రాంతాల ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకొని అధికారికంగా పండుగలు నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. కోనసీమలోని ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఇందుకు నిదర్శనమన్నారు.
భారీగా హాజరైన సందర్శకులు
మూడు రోజుల ఉత్సవాల్లో భవానీ ఐలాండ్‌కు సుమారు 15 వేల మంది, పున్నమి ఘాట్‌కు 30 వేల మంది చొప్పున మొత్తంగా 45 వేల మందికి పైగా సందర్శకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
అమరావతిని ప్రజారాజధానిగా, ఆవకాయను ఆంధ్రుల ప్రత్యేక రుచిగా అభివర్ణించిన మంత్రి, ఈ ఫెస్టివల్ జీవన నవరసాల సమ్మేళనమని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పర్యాటక శాఖ అధికారులు, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సంప్రదాయాన్ని భావితరాలకు అందించడంలో ఇలాంటి ఉత్సవాలు కీలకమని టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధులు పేర్కొన్నారుNTR VIJAYAWADA News.
ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఎండీ ఆమ్రపాలి కాట, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధులు శ్యామ్స్, సంజయ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.










