BREAKING NEWS – GUNTUR: తుది దశకు చేరుకున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
GUNTUR CORPORATION ELECTION
గుంటూరు నగరపాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రతిక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతో అధికార కూటమి, ప్రతిపక్ష వైసిపి క్యాంపు రాజకీయాలు నడిపాయి. క్యాంపులు ముగించుకొని కార్పొరేటర్లు ఓటు వేసేందుకు నగరపాలక సంస్థకు చేరుకున్నారు. టిడిపి క్యాంపులో మొత్తం 29 మంది కార్పొరేటర్లు దర్శనమిచ్చారు. అదేవిధంగా వైసీపీ క్యాంపులో 26 మంది కార్పొరేటర్లు కనిపించారు. ముందస్తుగా ఊహించిన విధంగానే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార కూటమి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 29 మంది కార్పొరేటర్లు కూటమి క్యాంపులో కనిపించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసిర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రత్తిపాడు బూర్ల రామాంజనేయులు దగ్గరుండి స్వయంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.
అదేవిధంగా వైసీపీ తరఫున ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వైసిపి తూర్పు ఇంచార్జి నూరి ఫాతిమా పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసిపి కార్పొరేటర్లు తమకు మద్దతు ఇచ్చారని టిడిపి ఎమ్మెల్యేలు, నేతలు తెలిపారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మేయర్ కావటి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార కూటమి నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి వారికి తగిన విధంగా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.