
సికింద్రాబాద్ :26-11-25:-మానవ హక్కుల కమిషన్ తాజా ఆదేశాల నేపథ్యంలో ఆటో మీటర్ చార్జీలను వెంటనే పెంచాలని తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. తిరుమలగిరిలోని ఆటో డ్రైవర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానంద్ మాట్లాడారు.గత 11 ఏళ్లలో బస్ చార్జీలను ఆరు సార్లు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను మూడు దఫాలు పెంచినప్పటికీ, ఎమ్మెల్యేలు తమ జీతాలను ఒకేసారి మూడు వందల శాతం పెంచుకున్నప్పటికీ… ఆటో మీటర్ చార్జీలు మాత్రం ఏకసారి కూడా సవరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అనేక మార్లు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా వర్గాల రాజకీయ ప్రయోజనాల కారణంగా పెంపు అమలులోకి రాలేదని తెలిపారు. ఇటీవల మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని శివానంద్ వివరించారు.అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల ఆచరణ సూత్రాల కారణంగా ఈ నిర్ణయం జనవరి నెలలోనే అమలు కావచ్చని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని రాజకీయంగా మలుచుకునే కొన్ని సంఘాలు ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకు రావాలని ప్రేరేపించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. ధర్నాలు, లాఠీచార్జీలకు ఆటో డ్రైవర్లు గురి కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.“వారి మాటలు విని మోసపోవద్దని, నిజమైన నిర్ణయం ప్రభుత్వము తీసుకునే వరకూ సహనం పాటించాలని” ఆటో డ్రైవర్లను కోరారు.







