
కృష్ణా : అవనిగడ్డ:30-10-25:-మొంథా తుపాన్ ప్రభావంతో నేలకొరిగిన పంటలను స్వయంగా పరిశీలించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గురువారం అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించారు. మోకాళ్ల లోతు బురదలోకి దిగి, రైతులతో మాట్లాడి, పంట నష్టాన్ని ప్రత్యక్షంగా చూశారు. అన్నదాతల కష్టాన్ని విని ఓదార్చారు.“మీ కష్టంలో మేమున్నాం… ప్రభుత్వం మీ వెంటే ఉంది” అని భరోసా ఇచ్చారు.కోడూరు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో నేలకొరిగిన వరి చేల మధ్యకు వెళ్లిన పవన్ కళ్యాణ్, రైతులతో కలసి ధాన్యపు గింజలను పరిశీలించారు. పొట్ట దశలో ఉన్న పంటలను తుపాను ముంచేసిందని రైతులు వివరించగా, కలెక్టర్‌ను వెంటనే పంట నష్టం నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కౌలు రైతులు కూడా నష్టపోయారని, వారికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అరటి తోటల్లోనూ పర్యటన
తరువాత అవనిగడ్డ మండలంలోని రామచంద్రపురం సమీపంలో తుపాను ధాటికి నేల మట్టం అయిన అరటి తోటను పరిశీలించారు. రైతు విష్ణుమూర్తి వివరించినట్లు సుమారు 1,400 అరటి గెలలు పనికిరాకుండా పోయాయి. ఉద్యాన శాఖ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తూ రైతులకు మేలు చేసే విధంగా నివేదికలు సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.“మానవతా దృక్పథంతో నివేదికలు ఇవ్వాలి”పంట నష్టం గణనలో వ్యవసాయ అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుల పక్షాన నివేదికలు రూపొందించి, కౌలు రైతులు సహా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

అవుట్ ఫాల్ స్లూయిజ్ నిర్మాణంపై చర్చ
కోడూరు, అవనిగడ్డ మండలాల్లో సముద్రపు పోటుతో పంట నష్టం జరుగుతోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. బ్రిటీష్ కాలం నాటి అవుట్ ఫాల్ స్లూయిజ్‌లు దెబ్బతిన్న కారణంగా సముద్రపు నీరు పొలాల్లోకి చొచ్చుకువస్తోందని చెప్పారు. దీనిపై సమగ్ర నివేదిక రూపొందించి, కొత్త స్లూయిజ్‌ల నిర్మాణం చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.ప్రజలతో మమేకంపర్యటన మొత్తం పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకమయ్యారు. తిరుగు ప్రయాణంలో కోడూరు–అవనిగడ్డ మార్గంలో విశ్వనాథపల్లి, వి.కొత్తపాలెం, మాచవరం గ్రామాల్లో ప్రజలను పలకరించారు. తుపాను ప్రభావం, ఇళ్ల నష్టం, జీవనోపాధి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పులిగడ్డ వద్ద కూరగాయలు, కొబ్బరి బొండాలు అమ్ముతున్న వ్యాపారులతో మాట్లాడి వారి స్థితి విచారించారు.శ్రీమతి గొర్రె నాగసూరి ఇంటి సమస్యను పరిష్కరించమని కోరగా, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
వృద్ధుడు పెద్ది వెంకటేశ్వరరావు దెబ్బతిన్న ఇంటిని పరిశీలించి, పునర్నిర్మాణం చేయమని ఆదేశించారు. ఆటో డ్రైవర్ బొర్రా రామును పలకరించి జీవనోపాధి గురించి తెలుసుకున్నారు.భూములపై రైతుల ఆవేదనకు స్పందనమచిలీపట్నం పోర్టుకు అనుసంధానంగా నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కారణంగా భూములు కోల్పోతామన్న రైతుల ఆందోళనను పవన్ కళ్యాణ్ శ్రద్ధగా విన్నారు. “మీ సమస్యలన్నింటినీ పరిశీలిస్తాం. ఎవరికీ అన్యాయం జరగదు” అని భరోసా ఇచ్చారు.రైతుల మధ్య నడుస్తూ, బురదలో అడుగులు వేస్తూ, ప్రతి ఆవేదన విని స్పందించిన పవన్ కళ్యాణ్ పర్యటన ఆద్యంతం మానవతా హృదయంతో సాగింది.







