
నేతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. చేతివృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలకు ఆర్థిక, సాంకేతిక పరమైన సహాయం అందించడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
సోమవారం ఏలూరు 30వ డివిజన్‌లోని బ్రహ్మంగారి గుడి వద్ద “నేతన్నకు అండగా కూటమి ప్రభుత్వం” పేరుతో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేతన్న భరోసా పథకం కింద సంవత్సరానికి రూ.25,000 ఆర్థిక లబ్ధి అందించే కార్యక్రమంలో భాగంగా ఈ సభ నిర్వహించబడింది.
కార్యక్రమంలో పలువురు చేనేత కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ—నాయీబ్రాహ్మణులకు 200 యూనిట్లు, చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. దేశీయ, విదేశీ మార్కెట్లలో చేనేత ఉత్పత్తుల విక్రయాలను పెంపొందించడానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
చేనేత మగ్గాలపై ఆధారపడిన వారికి నైపుణ్యాలను పెంపొందించి, చేనేత ఎగ్జిబిషన్ల ద్వారా అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా చేనేత ఉత్పత్తులను విక్రయించేలా సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, పార్టీ పరిశీలకులు మీరావలీ, ఎఎంసీ ఛైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, డిప్యూటి మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవానీ, డివిజన్ ఇంచార్జ్ బడిశెట్టి శ్రీనివాసరావు, దేవాంగుల సంఘం అధ్యక్షుడు బల్ల వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు చోడ వెంకటరత్నం, సెక్రటరీ రెడ్డి నాగరాజు, మాజీ ఎఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.







