
బాపట్ల: కారంచేడు :డిసెంబర్ 12:-ఇంటి నుండి తప్పిపోయిన 8 సంవత్సరాల బాలికను క్షేమంగా కనుగొని తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాలిక అదృశ్యంపై జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు.డిసెంబర్ 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన కారంచేడు గ్రామానికి చెందిన చౌటూరి నాగేంద్రం కుమార్తె (8 ఏళ్లు) గూర్చి తల్లిదండ్రులు డిసెంబర్ 9న కారంచేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు కారంచేడు ఎస్‌ఐ షేక్ ఖాదర్ బాషా పేర్కొన్నారు.Chiral Local News
బాలికను గుర్తించేందుకు చీరాల డీఎస్పీ ఎం.డి. మోయిన్ ఆధ్వర్యంలో ఇంకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.వి. రమణయ్య, కారంచేడు ఎస్‌ఐ ఖాదర్ బాషా, ఇంకొల్లు ఎస్‌ఐ సురేష్, చిన్నగంజాం ఎస్‌ఐ రమేష్‌లతో కూడిన నలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ వెల్లడించారు.శోధనలో భాగంగా బాలిక ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో పోస్ట్ చేసి, విస్తృత ప్రచారం చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి, చీరాల, పర్చూరు, ఇంకొల్లు, చిలకలూరిపేట వంటి ప్రాంతాల్లో పోలీసులు రాత్రింబగళ్లు గాలింపు చేపట్టారు. చివరకు చిలకలూరిపేట కోటప్పకొండ మార్గంలోని క్రాస్ రోడ్ వద్ద బాలిక కనిపించడంతో, వెంటనే స్పందించిన బృందాలు ఆమెను క్షేమంగా అప్పగించినట్టు సమాచారం.తన కుమార్తెను సురక్షితంగా అందించినందుకు పోలీసులకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా బాలిక జాడను కనుగొనడంలో కృషి చేసిన చీరాల డీఎస్పీ, ఇంకొల్లు సర్కిల్ టీంలను ప్రత్యేకంగా అభినందించినట్టు ఎస్పీ తెలిపారు. అదనం గా, సోషల్ మీడియాను సక్రమ దిశలో వినియోగిస్తే ప్రజల మేలు కోసం వేగవంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ సూచించారు.







