

మినీ అంగన్వాడి కేంద్రాలను సాధారణ అంగన్వాడి కేంద్రాలుగా మార్పు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. అంగన్వాడి కేంద్రాల మిళితంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. గర్భిణీలు, బాలింతలకు మరిన్ని సేవలు అందించే క్రమంలో మినీ అంగన్వాడీ కేంద్రాలను సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రీస్కూల్ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గర్భిణీలు, బాలింతలకు సకాలంలో పౌష్టికాహారం అందించడానికి వీలు కలుగుతుందని వివరించారు. ఆ మేరకు జిల్లాలో ఇప్పటి వరకు 16 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిని అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆమోదించినట్లు తెలిపారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామన్నారు. మినీ అంగన్వాడి కార్యకర్తలకు గౌరవ వేతనం రూ.ఏడు వేలు ఇస్తుండగా, మార్పు చేసిన తదుపరి రూ.11,500 లు గౌరవ వేతనంగా అందుకుంటారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి కేంద్రాలను మార్పులు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి రాధా మాధవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ, డి ఈ ఓ పురుషోత్తం, బాపట్ల ఆర్డీవో పి గ్లోరియా, తదితరులు పాల్గొన్నారు.







