Bapatla Collectorate’s Amazing Constitution Day: 75th Resolution for National Unity||బాపట్ల కలెక్టరేట్‌లో అద్భుతమైన రాజ్యాంగ దినోత్సవం: జాతీయ ఐక్యతకు 75వ సంకల్పం
జాతీయ ఐక్యత, సమగ్రతను సంరక్షిస్తూ సౌబ్రాతృత్వాన్ని విద్యార్థులు, ప్రజల్లోనూ పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం బుధవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. విద్యార్థులు, సభికులతో భారత రాజ్యాంగ పీఠిక ను కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
అభివృద్ధి చెందుతున్న దేశం నడపడానికి రాజ్యాంగం ఎంతో కీలకమని కలెక్టర్ చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలతోనే ప్రజలు సుభిక్షంగా ఉండేలా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని వివరించారు. ప్రజలు సంతోషం, స్వేచ్ఛగా జీవించడానికి ప్రాథమిక హక్కులను రాజ్యాంగం కల్పించిందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే అతిపెద్ద రాజ్యాంగం కలిగిఉన్న భిన్నమైనది మన భారతదేశం అని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వంతో ప్రతి పౌరుడు ముందుకు సాగాలన్నారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో బాపట్ల జిల్లా నుంచి విద్యార్థులు పాల్గొనడం సంతోషాదాయకమన్నారు. రాజశేఖర్ అనే విద్యార్థి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించడానికి ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. విద్యార్థి దశలో కర్ణాటక రాష్ట్రంలో జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్ కు నేను ఎంపికయ్యానని తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలన్నారు. సామాజిక స్పృహ, అవగాహన కలిగి ఉండాలన్నారు. తోటి విద్యార్థులకు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
రాజ్యాంగం విలువలను గుర్తించి పాటించడం శుభ పరిణామమని జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. విద్యార్థులంతా దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని కోరారు. స్వాతంత్ర్యం రాగానే దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశేషంగా కృషి చేశారన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు.
వికసిత్త భారత్ దిశగా అడుగులు వేస్తోందని చెరుకుపల్లి మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాల పదో తరగతి విద్యార్థిని శ్రావణ ప్రియ తెలిపారు. సుస్థిరాభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ శరవేగంతో పయనిస్తోందన్నారు. మేకింగ్ ఇండియా లక్ష్యంతో ప్రజాస్వామ్యంలో పాలకులు పనిచేస్తున్నారని వివరించారు. బయోటెక్నాలజీ, సాంకేతిక రంగం, పారిశ్రామిక రంగాలలో అనేక మైలురాళ్లను సాధిస్తుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సుపరిపాలన అందిస్తూ మంచి పాలనను పాలకులు అందిస్తున్నారని తెలిపారు.
రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ప్రజలకు అన్ని హక్కులు లభించాయని చిన్నగంజాం మండలం పడవకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని తుషార చెప్పారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఆమోదించిన విషయాలను వివరించారు.
అనంతరం మాక్ పార్లమెంట్ కు ఎంపికైన 10 మంది విద్యార్థులను పతకాలు, అవార్డులతో కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఉపాధ్యాయులు సాదిక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయిలో మాక్ పార్లమెంట్ కు ఎంపికై అమరావతికి వెళ్లిన వారిలో పి సహస్ర, ఎన్ వెంకట సూర్య మణికంఠ, కె ధనుష్, పి మోనిష్ జోయల్, జె భాగ్యశ్రీ, ఏ రాజశేఖర్, కె జెఫన్య ఉన్నారు. అలాగే జిల్లా స్థాయిలో ఎంపిక అవార్డు పొందిన వారిలో టి కళ్యాణి, ఎం ఏబేజు, జె లీలా శ్రీ లక్ష్మి, షేక్ చాందిని, షేక్ సమీరా, జి అక్షయ, టీ చంద్రహాసిని, ఎన్ యాస్మిన్, కె గీతిక మాధురి లు ఎంపికయ్యారని డి ఈ ఓ పురుషోత్తం తెలిపారు.