
బాపట్ల:నవంబర్ 11 :- బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు రోజులపాటు నిర్వహించబడనున్న “సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్” వర్క్‌షాప్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కళాశాల CSE (సైబర్ సెక్యూరిటీ) విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.ప్రారంభ కార్యక్రమానికి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు శ్రీ ముప్పలనేని శ్రీనివాసరావు గారు హాజరై వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్–2 శ్రీ పి. చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్. రమా దేవి, విభాగ ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, “నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలపై అవగాహన అత్యవసరం. ఇలాంటి వర్క్‌షాప్‌ల ద్వారా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించుకోవాలి” అన్నారు.వైస్ ప్రెసిడెంట్ పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, “తరగతుల్లో నేర్చుకున్న సిద్ధాంత జ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా వినియోగించుకోవడం విద్యార్థుల భవిష్యత్తుకు దోహదం చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అనుభవం పెంపొందించడానికి ఈ వర్క్‌షాప్‌లు ఉపయోగపడతాయి” అని తెలిపారు.కళాశాల ప్రిన్సిపల్ డా. రమా దేవి మాట్లాడుతూ, “డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. విద్యార్థులు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, డిజిటల్ ఫోరెన్సిక్స్ రంగాల్లో నైపుణ్యం పొందడం సమయానుకూలం” అని పేర్కొన్నారు.ఈ వర్క్‌షాప్‌లో విజయవాడకు చెందిన సుప్రజా టెక్నాలజీస్ సంస్థకు చెందిన శ్రీ K. కుమార్ మరియు ఆయన బృందం రిసోర్స్ పర్సన్లుగా పాల్గొని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పద్ధతులు, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, డేటా రికవరీ, ఫోరెన్సిక్ టూల్స్ వినియోగం వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు.వర్క్‌షాప్‌లో భాగంగా 24 గంటల హ్యాకథాన్ కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ రంగంలోని వాస్తవ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను రూపొందించనున్నారు.నిర్వాహకుల ప్రకారం, వర్క్‌షాప్ నవంబర్ 15 వరకు కొనసాగుతుంది. చివరి రోజు ఉత్తమ ప్రదర్శన చేసిన బృందాలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.







