
బాపట్ల:11-12-25:- జిల్లాలో విద్యా పరిపాలనకు నూతన ఊపునిచ్చే అధికారిగా డి. శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి బదిలీపై బాపట్లకు వచ్చిన ఆయన, బాధ్యతలు చేపట్టే ముందు మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.విను కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు స్మారకంగా మొక్కను అందజేశారు.
తరువాత డీఈవో కార్యాలయంలోని సిబ్బందితో సమావేశమై ప్రాథమిక పరిపాలనా అంశాలు, జిల్లాలో విద్యా రంగం పురోగతి, పాఠశాలల పనితీరు, నూతన విద్యా సంస్కరణల అమలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సమగ్ర కార్యాచరణను రూపొందిస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యార్థుల హాజరు శాతం పెంపు, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల అభివృద్ధి, విద్యా నాణ్యత బలోపేతం తమ ప్రాధాన్యతలలో భాగమని ఆయన తెలిపారు. కొత్త డీఈవో బాధ్యతలు స్వీకరించడంతో విద్యాశాఖ సిబ్బంది ప్రాంతీయ స్థాయిలో కొత్త మార్పులపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.







