
బాపట్ల:డిసెంబరు 22 :-జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ.జి.ఆర్.ఎస్) కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 60 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీ గారి దృష్టికి తీసుకువచ్చారు.

కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు తదితర సమస్యలపై అర్జీలు అందాయి. జిల్లా ఎస్పీ గారు అర్జీదారులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. సంబంధిత అర్జీలను చట్టపరంగా వేగవంతంగా విచారించి, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్జీలపై తీసుకున్న చర్యల నివేదికలను జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపించాలని సూచించారు.Bapatla Local News
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రజలు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో మోసాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. అధిక లాభాల ఆశ చూపిస్తూ నకిలీ వెబ్‌సైట్లు, లింకుల ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారని పేర్కొన్నారు.

వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఐపీఓలలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మిస్తారని చెప్పారు. మొదట తక్కువ మొత్తంతో నకిలీ లాభాలు చూపించి, ఆ తరువాత భారీ మొత్తాలు పెట్టుబడులు పెట్టించుకుని చివరికి డబ్బు విత్‌డ్రా చేయనివ్వకుండా మోసం చేస్తున్నారని వివరించారు.

అపరిచిత లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని, అత్యాశకు లోనై పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా మంది తమ విలువైన డబ్బును కోల్పోతున్నారని తెలిపారు. ఏదైనా సైబర్ మోసం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేయాలని లేదా https://cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. అలా చేస్తే కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ శ్రీ పి.జగదీష్ నాయక్ గారు, పీజీఆర్‌ఎస్ సెల్ మహిళా ఎస్‌ఐ లక్ష్మి రాజ్యం గారు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







