
బాపట్ల:29-11-25:-హెచ్ఐవి–ఎయిడ్స్ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకోవాల్సిన అవసరం ఉందని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. విజయమ్మ అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శనివారం బాపట్ల పట్టణంలో జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు స్వచ్ఛంద సంస్థలు, వైద్య–ఆరోగ్య విభాగ సిబ్బంది, పీఎస్‌కే నర్సింగ్ కాలేజీ విద్యార్థినులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ విజయమ్మ,తెలుసో తెలియకో, ఆవేశంలోనో హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడిన వారు అకాల మరణం చెందడం బాధాకరం అని, వారి ఆత్మలకు శాంతి చేకూరేలా నివాళులు అర్పించడం మన అందరి బాధ్యత అని తెలిపారు. హెచ్ఐవి–ఎయిడ్స్‌తో మరణించిన వారి కుటుంబాలకు మానసిక బలం కల్పించడంతో పాటు, ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని కూడా ఆమె సూచించారు.హెచ్ఐవి–ఎయిడ్స్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు ఆశ్రయం, రక్షణ, భరోసా కల్పించే దిశగా అందరూ ముందుకు రావాలని డాక్టర్ విజయమ్మ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీఐఓ రత్న మన్మోహన్, డాక్టర్ లలితా రాజేశ్వరి, డాక్టర్ బాల సుధా, డాక్టర్ మౌనిక, దిశా క్లినికల్ సర్వీసెస్ ఆఫీసర్ ఎం. చైతన్యకుమార్, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ పి. కిరణ్‌కుమార్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీబీ సాగర్, బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







