
బాపట్ల:13-11-25:- పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాపట్ల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వాసుదేవ వినోద్ కుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మొక్కలు నాటారు.

తరువాత మాట్లాడిన ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ –“బాపట్ల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయం మోడల్ కార్యాలయంగా తీర్చిదిద్దబడింది. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాం. ఈ యూనిట్ ద్వారా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి, సమన్వయపరచడం ప్రధాన లక్ష్యం. నియోజకవర్గ కేంద్రాల్లో శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించగా, దాని ఫలితంగా ఈ యూనిట్ కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి” అని తెలిపారు.అలాగే ఎమ్మెల్యే పేర్కొంటూ
“బాపట్ల యూనిట్ కార్యాలయంలో ప్రతి మంగళవారం, బుధవారం, శుక్రవారం తాను ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజలు ఎప్పుడైనా తమ సమస్యలపై నన్ను నేరుగా కలుసుకోవచ్చు. రాబోయే రోజుల్లో బాపట్ల జిల్లాలో పర్యాటక రంగం, ఆక్వా రంగం, విద్యా రంగంలో విస్తృత అభివృద్ధి జరగనుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది” అని తెలిపారు.సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులూ పాల్గొన్నారు.







