బాపట్ల:28-10-25:-మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంట కాల్వల పరివాహక ప్రాంతాల్లో నివాసముండే ప్రజలను తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు.జిల్లా ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి, కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం బాపట్లలోని నల్లమడ (నాగరాజు కాల్వ), తూర్పు తుంగభద్ర కాల్వలు, పరివాహక ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం నల్లమడ కాల్వలో 12 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి చేరుతోందని, ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.వరద నీటి ప్రవాహంతో పరివాహక గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించే ప్రమాదం ఉందని, ముందస్తుగా ప్రజలను తరలించడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చని సూచించారు. జిల్లెలమూడి గ్రామం, జమ్ములపాలెంలోని బెస్ట్ సైడ్ డ్రైన్, హైదరిపేటలోని నల్లమడ కాల్వ గట్లు, కర్లపాలెంలోని ఈస్ట్ తుంగభద్ర కాల్వ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు.
ఆవాస ప్రాంతాల్లో ప్రజలను తరలించడానికి అవసరమైన వాహనాలను సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం ప్రజల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ పరిశీలనలో జలవనరుల శాఖ అధికారి అబూతలీమ్, ఉపకార్య నిర్వాహక ఇంజినీర్ ఇంకొల్లు ధనలక్ష్మి, జేఈ సునీత తదితరులు పాల్గొన్నారు.







